English | Telugu

భారీ వర్షాలకు కర్ణాటక లో పన్నెండు మంది మృతి...

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెస్తున్నాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహంలో వాహనాలు సైతం కొట్టుకు పోతున్నాయి. మైసూరు, కొడుగు, చిక్ మంగళూర్, శివమొగ్గ లో భారీ వర్షాలు పడ్డాయి.

ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వందలాది గ్రామాలు నీట మునిగిపోయి అపార నష్టం వాటిల్లింది. ప్రధాన పంటల్లో ఒకటైన ఉల్లి పంట పూర్తిగా నీటిపాలైంది. ఇక ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలుచోట్ల వరద నీరు పంట భూములు ఊళ్లను ముంచేస్తోంది. పొంగిపొర్లుతున్న వరద నీటిలో వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. అటు అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కుండ పోత వర్షం వల్ల వరద నీరు ఊళ్లను ముంచేస్తోంది. దీంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు నీటిలో గడపాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో ఆరు బయటే గడపాల్సిన పరిస్థితి.

అధికారులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. భారీ వరదల వల్ల పలు ప్రాంతాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో రహదారులు వంతెనలు వరద నీటిలో కొట్టుకు పోతున్నాయి. రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నడీలను అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఇటీవలి కాలంలో తాము ఇలాంటి వర్షాలు చూడలేదని అక్కడి జనం చెప్తున్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.