English | Telugu

మొదలైన "కోవాగ్జిన్" మూడో దశ ట్రయల్స్... వ్యాక్సిన్ కోసం వాలంటీర్లుగా బడా బాబుల క్యూ..

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తాజాగా బడాబాబులు క్యూ కడుతున్నారు. ఖరీదైన కార్లలో వస్తున్నబ్యూరోక్రాట్లతో పాటు బడా వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు నేరుగా ఆస్పత్రికి వెళ్లి "కోవాగ్జిన్" వ్యాక్సిన్ వలంటీర్లుగా తమ పేరు నమోదు చేయించుకుంటున్నారు. ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ ల సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేయగా, గుంటూరులో గత గురువారం నుండి ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్ మొదలయ్యాయి.

ఈ ట్రయల్స్మొ లో భాగంగా మొత్తం 1000 మందికి వ్యాక్సిన్ ను ఇవ్వాలని నిర్ణయించగా, తొలి మూడు రోజుల్లోనే 150 మంది వలంటీర్లుగా నమోదు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా ఐఏఎస్‌, అత్యున్నత స్థాయి అధికారులు, ప్రైవేట్‌ డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నట్లుగా సమాచారం.

ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ గురించిన వార్తలు వస్తుండడంతో పాటు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఎక్కువ మంది ప్రజలు భావిస్తుండడంతో.. వ్యాక్సిన్ ట్రయల్స్ కు భారీ స్పందన వస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా నమోదు చేసుకున్న ప్రతి వలంటీర్ ‌కు 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ నరాలకు ఇస్తారు. తరువాత 28వ రోజున రెండో డోసు వ్యాక్సిన్ వేసిన తరువాత 60వ రోజున వీరిలో కరోనా యాంటీబాడీలు, ఇమ్యునోగ్లోబులిన్‌ స్థాయిలను నిపుణులు పరిశీలిస్తారు. ఇవి నిర్దేశిత ప్రమాణంలో ఉంటే వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్లుగా నిర్ధారిస్తారు.