English | Telugu
జగన్ అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే?
Updated : Sep 27, 2025
ప్రతీకార రాజకీయాల అన్నవి తన డిక్షనరీలోనే లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందన్నారు. జగన్ హయాంలో తనను అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం సృష్టించిన భయానక వాతావరణాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. తాను అరెస్టైనప్పుడు తనను పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను మార్గమధ్యంలో ఆపేశారన్నారు. జగన్ హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతు దారులు ఎవరినీ ఉపేక్షించలేదనీ, వారి ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించారి చంద్రబాబు చెప్పారు.
తాను అధికారం చేపట్టిన తరువాత తలుచుకుంటే మొదటి రోజునే ఆయనను (జగన్) అరెస్టు చేయగలిగే వాడిననీ, అయితే తన విధానం అది కాదనీ అన్నారు. తాను అటువంటి రాజకీయ నాయ కుడిని కానని చంద్రబాబు చెప్పారు. చట్టాలపైనా, రాజ్యాంగంపైనా తనకు నమ్మకం ఉందన్నారు. ప్రతీకార రాజకీయాల గురించి ఎన్నడూ ఆలోచించననన్నారు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందనీ చెప్పారు. అందుకే ప్రజలు తనను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్న చంద్రబాబు, వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయనని చెప్పారు.