English | Telugu

వెయ్యి రూపాయ‌ల‌కే కరోనా వ్యాక్సిన్ !

మ‌న దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను కేవ‌లం 1000 రూపాయ‌ల‌కే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.

మే నెలలోనే మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ట్రయల్స్ కోసం తాము వేచి చూడబోమన్నారు.

మొదటి దశలో నెలకు 10 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామన్నారు. తరువాత నెలకు 20 నుంచి 40 మిలియన్ల డోసులను తయారు చేస్తామన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి 2-4 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. మందులేని ఈ డెడ్లీ వైర‌స్ మహమ్మారిని అంతంచేసేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ను ఎవ‌రు ముందుగా తీసుకువ‌స్తార‌ని ప్ర‌పంచం ఎదురుచూస్తోంది.