English | Telugu

ప్రైవేటు ఉద్యోగుల జీతాలు వస్తాయా?

మనందరం లక్ష్మణ రేఖ గీసుకుని లాక్ డౌన్ ఆచరించాలి, ప్రజల ఆరోగ్యంకోసమే ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించాలి.. దేశం మునుపెన్నడూ ఎదుర్కోని ఇలాంటి విపత్కర పరిస్తితులను అర్ధం చేసుకుని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. మానవతా దృక్పదంతో లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ఇదీ..లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ మాట్లాడిన..మాటలు. చేసిన విన్నపాలు. కానీ మన ముఖ్యమంత్రుల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంది. మొన్న కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 75, 60, 50, 10 శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఒక రోజు వ్యత్యాసంతో నేనున్నాను, నేనువిన్నాను, నేను చూసాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఉద్యోగుల జీతాలను రెండు విడతలుగా చేల్లిస్తామంటూ జీఓ జారీ చేసారు.

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ముఖ్యమంత్రి దగ్గర్నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకూ అందర్నీ చేర్చారు కానీ..కుప్పలు తెప్పలుగా ఉన్న సలహాదారుల జీతాల గురించి ఒక్క అక్షరం కూడా లేకపోవడం గమనార్హం. వీరికి జీతాలు ఇస్తున్నారో, లేదో స్పష్టత ఇవ్వకపోవడం పట్ల జీతాల్లో కోతలు పడ్డ వేతనజీవులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంచితే ప్రయివేటు యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. తప్పనిసరిగా జీతాలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేసిన ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగులకు జీతాల్లో కోతలు పెడితే ప్రయివేటు సంస్థలు దీన్ని సాకుగా చూపవా? ప్రభుత్వమే వేతనాలు ఇచ్చే పరిస్తితుల్లో లేనప్పుడు మేమెక్కడినుంచి ఇవ్వగలం అని ఆనవా? అన్న సందేహాలు ప్రయివేటు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి.