English | Telugu

అవమానాల మధ్య వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు కరోనా పరీక్ష..

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బస్తాను ప్రచారం కోసం వాలంటీర్ల చేతుల మీదుగా అందుకుని ఫొటోలు దిగిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే ఈయన. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మన ప్రభుత్వమే ఉంది ఎవరేమనుకుంటారని భావించారో ఏమో అప్పలరాజు నిబంధనలు ఉల్లంఘించి ఎంచక్కా విజయవాడ వెళ్లి కొద్ది రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి తిరిగొచ్చారు. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మన జనాన్ని రాష్ట్రంలోకి అనుమతించకుండా క్వారంటైన్ కు పంపుతామని బెదిరిస్తున్న వైసీపీ సర్కారు.. ఈయన్ను మాత్రం ఏమీ అడగలేదు. విజయవాడ వెళ్లొచ్చిన పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి ఆటంకాలు చెప్పకుండా పలాసకు పంపించారు.

ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కరోనా వ్యాప్తిస్తున్న వేళ వైరస్ ప్రభావం లేని తమ జిల్లాలోకి ఎంటరైన ఈయన గారిని సొంత నియోజకవర్గంలోని విపక్ష నేతలు, అధికారులు, స్ధానిక ప్రజలు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కరోనా పేరుతో ఇళ్లకే పరిమితం చేస్తున్న మీరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడ ఎలా వెళ్లొచ్చారని ఎమ్మెల్యే అప్పలరాజును ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధికారిక కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోనూ అవమానాలు, ప్రశ్నలు తప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి జనంలో రోజురోజుకూ పలుచన కావాల్సిన పరిస్ధితి ఎదురైంది.

చివరకు ఏడాది క్రితం తనకు ఓట్లేసిన సొంత నియోజకవర్గం ఓటర్లతో పాటు తాను రోజు కలిసి పనిచేయాల్సిన అధికారులు సైతం తనను అనుమానపు చూపులు చూస్తుండే సరికి ఈయన తట్టుకోలేకపోయారు. వారం రోజులుగా అవమానాలను భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అప్పలరాజు చివరికి ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీటి ఫలితాలు వచ్చే వరకూ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అధికారులు, స్ధానిక ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితి. అసలే ఇప్పటివరకూ కరోనా ప్రభావం లేని శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు నెగెటివ్ వస్తే సరేసరి.. కానీ పాజిటివ్ వస్తే పరిస్ధితి ఏంటన్న భయాందోళనలు స్ధానికంగా నెలకొంటున్నాయి.