English | Telugu

తెలంగాణాలో తప్పుదోవ పట్టిస్తున్న కరోనా లెక్కలు!

* దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో-5221,
* తెలంగాణలో 1003.

ఈ లెక్కలు చూసి తెలంగాణలో మొత్తం పరిస్తితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని పప్పులో కాలేసేరు. కరోనా కేసులు చేసే పరీక్షల మీద ఆధారపడి ఉంటాయి. పరీక్షలు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ, అసలు చేయకుంటే అసలు ఒక్క కేసూ ఉండదు. ఒక్కొక్క ఇంట్లో పదుల సంఖ్యలో కేసులు బయటబడుతుంటే ఇంకా తెలంగాణలో త‌క్కువ కేసులెందుకు వున్నాయి. ఈ అనుమానం చాలామందికి రావచ్చు.

ఒకసారి లెక్కలను మరింత లోతుగా విశ్లేషిద్దాం...?
తెలంగాణలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు : 13200. అయితే బ‌యటపడిన కేసులు: 943 మాత్ర‌మే.

ప్రతీ 100 పరీక్షలకు తెలంగాణలో బయటపడుతున్న కేసులు: (100/13200)x1003 = 7.59

మహారాష్ట్రలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు: 75838. అయితే
బయటపడిన కేసులు: 5221

ప్రతీ 100 పరీక్షలకు మహారాష్ట్రలో బయటపడుతున్న కేసులు: (100/75838)x5221 =6.88

అంటే, తెలంగాణలో ప్రతీ 100 కేసులకూ 7.59 పాజిటివ్ వస్తే, మహారాష్ట్రలో ఈ సంఖ్య మనకన్నా తక్కువగా (6.88) ఉంది. అంటే కేసుల శాతం తెలంగాణలో మహారాష్ట్ర కన్నా ఎక్కువగా ఉంది.

తెలంగాణలో కూడా మహారాష్ట్ర మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో బయటపడదానికి అవకాశం ఉన్న కేసుల సంఖ్య: (75838/13200) x 1003 = 5762. ఇది మహారాష్ట్ర కన్నా 541 ఎక్కువ.

అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం అమాయకత్వం.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వారికి అంత్యక్రియలు కరోనా రోగులకు నిర్వహించినట్లుగానే నిర్వహించాలి కానీ, వారికి కరోనా పరీక్షలు చేయవద్దని చెప్పడానికి కారణం ప్రభుత్వం వివరించలేదు. దీంతో కరోనా మరణాల లెక్కలు తెలంగాణలో చాలా తక్కువగా నమోదైతాయి.

అలాగే, కరోనా రోగుల సెకండరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు చేయవద్దని నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో చూపించే కరోనా కేసుల సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా గణనీయంగా తక్కువ ఉంటుంది.

అసలు వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది?
‘వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది? ఖర్చు తప్ప...” అనే అనుమానం చాలా మందికి రావచ్చు. తెలంగాణలో కోటి మందికి పరీక్షలు చేసినా 600 కోట్ల రూపాయల ఖర్చుకాదు. తెలంగాణలో రెండు రోజులు లాక్ డౌన్ తో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం (సుమారు రూ800కోట్లు) కన్నాఈ ఖర్చు తక్కువ.
కాబట్టి పరీక్షలకు ఖర్చుకు సంబంధం లేదు.

మరి పరీక్షలతో లాభం ఏంటి?
దీనికన్నా ముందు, అసలు లాక్ డౌన్ తో లాభమెంటోతెలుసుకోవాలి. లాక్ డౌన్ తో వైరస్ సమాజం నుండి తొలగిపోదు. లాక్ డౌన్ కరోనా వ్యాప్తికి తాత్కాలికంగా కట్టడి వేస్తుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద ఒకే సారి తీవ్రభారం పడకుండా ఆపుతుంది.

ఈ లోగా ప్రభుత్వం కరోనాను నిర్మూలించాలంటే లాక్ డౌన్ తో పాటు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం, గుర్తించిన రోగులను ఇతరుల నుండి వేరు పరచడం, చికిత్సనందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి.

తెలంగాణ పరీక్షల సంఖ్యను అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. మన కన్నా తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలు మనకు ఆదర్శం కాకూడదు. ఇలా కాకుండా కేవలం లాక్ డౌన్ ఒక్కటే మార్గమనుకుంటే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం సరికదా దీర్ఘకాలిక లాక్ డౌన్ లతో ప్రజల జీవితాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నమవుతుంది.

మరోవైపు కేసులు తక్కువగా ఉన్నాయని లాక్ డౌన్ ఎత్తివేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్తితి భిన్నంగా ఉండి, కరోనా మరింతగా విజృంభించే చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదిక పై చర్యలు చేపట్టాలి. పరిస్తితి నియంత్రణలోకి రాగానే లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయాలి.