English | Telugu
ఓట్ల కోసం వ్యాక్సిన్ వాయిస్! జోరుగా కరోనా పాలిటిక్స్
Updated : Oct 23, 2020
మన దేశంలోనూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండగా రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. బీహార్‌లో ప్రతి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది తమ తొలి హామీ అని ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బీజేపీ కరోనా హామీపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకమని విమర్శించారు రాహుల్ గాంధీ. ఎన్నికలు జరగనున్నది ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు? వీళ్లు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఇంకా రాని వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రజలకు ఎలా చెబుతారు? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఇతర పార్టీలు కూడా మండిపడుతున్నాయి. బీహార్ లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరు ఇస్తారు అంటూ కొన్ని పార్టీలు నిలదీస్తున్నాయి. వ్యాక్సిన్ దేశానికి సంబంధించింది అని...బిజెపికి సంబంధించింది కాదని పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్‌ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీహారీలకు ఫ్రీ టీకా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీపై ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. జనాల్లో తిరుగుతున్నా మీకు వైరస్ సోకలేదు.. టీకా వేసుకున్నారా?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. లేదని చెబుతూ కేటీఆర్ ఈ సమాధానం చెప్పారు. రాజకీయాలకు వ్యాక్సిన్ అంశాన్ని వాడుకోవటంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
బీహార్ లో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ముందుగానే ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే తమిళనాడు ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తామని ఆయన వెల్లడించారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో కరోనా కీలక అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అమెరికా సహా అన్ని దేశాల్లోనూ రాజకీయ పార్టీలు కరోనా వ్యాక్సిన్ ను ఓట్ల రాబట్టుకోవడం కోసం ఉపయోగించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో పరిశోధన సంస్థలు స్పష్టంగా చెప్పడం లేదు. అలాంటి సమయంలో ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడమంటే ప్రజలను మోసం చేయడమేనన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది.