English | Telugu

గ్రేటర్ లో కనిపించని కాంగ్రెస్ బడా నేతల హడావిడి.. కారణం అదేనా 

జీహెచ్ ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్, బీజేపీ, మ‌జ్లిస్ పార్టీలు సవాళ్ల మీద స‌వాళ్లు విసురుకుంటూ తీవ్రంగా వణికిస్తున్న చలిలో కూడా వాతారవరణాన్ని హీటెక్కిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆయా పార్టీల ముఖ్యనేతలతో పాటు జిల్లాలలోని కేడర్ కూడా తరలి వచ్చి హైదరాబాద్ ఎన్నికలలో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ముఖ్య నాయకుల హడావిడి మాత్రం ఈ ఎన్నికలలో ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా క‌నీసం న‌గ‌రానికి చెందిన కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా యాక్టీవ్‌గా క‌నిపించ‌క‌పోవ‌డం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా చెప్పుకునే చాలా మంది నేత‌లు ఈ ఎన్నిక‌ల్లో మొహం చాటేయడానికి చాలా కార‌ణాలే ఉన్నాయని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షా పదవి ఇస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన చర్చ సాగుతుండడంతో పార్టీలోని ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ర్వాత పీసీసీ ప‌ద‌వి క‌చ్చితంగా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ఆశ‌తో ఉన్న వారు.. ఇటు తాము ప్ర‌చారానికి రాక‌పోగా, అటు తమ అనుయాయులను కూడా ప్రచారంలో పాల్గొన‌కుండా చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని సమర్ధించేవాళ్లు కూడా ఈ ఎన్నిక‌ల్లో స‌హాయ నిరాక‌ర‌ణకు దిగార‌ని కాంగ్రెస్ వర్గాలలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇంకోవైపు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సరైన ఫ‌లితాలు రాక‌పోతే.. దాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మలచుకునేందుకు ఇప్ప‌టి నుండే ఆయా నేత‌లు ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలలో ఏదైనా తేడా కొడితే.. అపుడు తాము గ్రేట‌ర్ బాధ్య‌తలు తీసుకొని ఉంటే క‌చ్చితంగా గెలిచేవాళ్ల‌మ‌ని… తమను కలుపుకు పోకపోవడంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా తయారైందని చెప్పుకునేందుకు పెద్ద తలాకాయలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నార‌ట‌. గ్రేట‌ర్ ఎన్నిక‌లలో ఈ సోకాల్డ్ సీనియ‌ర్ నాయకులు అందుకే ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఎంతైనా పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్ మనకు తెలియనివా అని గొణుక్కుంటూనే పార్టీ కేడర్ మాత్రం తమ పని చేసుకుపోతున్నారు.