English | Telugu

తెలంగాణ‌లో క‌రోనా క‌మ్యూనిటి స్ప్రెడ్ మొద‌లైంది

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటి స్ప్రెడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగైదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. హైదరాబాదులో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో వైరస్ విస్తరిస్తోందని హెల్త్ డైరెక్టర్ చెప్పారు.

కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని, ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రూ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని కోరారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్నవారు ఆల‌స్యం చేస్తే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. కరోనా విషయంలో వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందిస్తే.. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అని శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు.

ఇక‌, కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింద‌న్న హెల్త్ డైరెక్టర్.. ప్రతీ రోజూ 15 వేల టెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప‌రిస్థితులు చాలా బెటర్‌గా ఉన్నాయ‌ని, కరోనా బారిన‌ ప‌డిన‌వాళ్ల‌లో రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య పెరిగింద‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8399 పడకలు ఉన్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి, ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు.