English | Telugu

ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉంది.. అక్బరుద్దీన్‌ తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకాలం టీఆర్ఎస్ కి మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం.. ఉన్నట్టుండి టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకించడం, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గళం వినిపించడం మొదలుపెట్టింది. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని నిన్న అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. కరసేవకులను అయోధ్య రాకుండా కట్టడి చేయడంలో పీవీ సర్కార్ నిర్లక్ష్యంగా వహించందని గతంలో ఎంఐఎం ఆరోపించింది. ఈ కారణంగానే పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈరోజు అసెంబ్లీలో ఎంఐఎం వ్యవహరించిన తీరు చూస్తే టీఆర్ఎస్ కి దూరమవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.

సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ క్వశ్చన్ అవర్‌లో స్పీకర్‌తో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు సభలో మాట్లాడేందుకు ఆరు నిమిషాల సమయం ఏం సరిపోతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే దానిపై చర్చ పెట్టకుండా అనవసరమైన అంశాలపై చర్చ పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి తాము ప్రతీ అంశంలో సహకరిస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్‌పై అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై కూడా అక్బరుద్దీన్ విమర్శలు చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా అంశంపై మంత్రి ఈటల మాట్లాడారు. కరోనా పోరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 24,408 మందికి రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ఇచ్చామని, కోట్ల సంఖ్యలో మందులు సమకూర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి కిట్లు అందిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కూడా సరిపడ అందుబాటులో పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 0.6 శాతం మాత్రమే డెత్ రేట్ ఉందన్నారు.

మంత్రి ఈటల ప్రసంగంపై అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉందని విమర్శించారు. కరోనా వారియర్స్ ను ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కోవిడ్‌ నిధికి విరాళాలు ఇచ్చిన వారిని గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యల‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషి చేశారని అన్నారు. కరోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గలేదన్నారు.

సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యవహరించిన తీరు చూస్తుంటే టీఆర్ఎస్ కి దూరమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అయ్యారని బీజేపీ పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా గళం వినిపించడం ఆసక్తికరంగా మారింది.