English | Telugu
ఆనందమానందమాయే.. మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్
Updated : Dec 30, 2019
కేసిఆర్ కి దైవ భక్తి చాలా ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అధికారంలోకి రాగానే యాదగిరి గుట్టను గొప్ప పుణ్యక్షేత్రంగా రూపొందించేందుకు చర్యలు కూడా చేపట్టారు. ఇటీవలే ఆయన దానిని ప్రత్యేకంగా కూడా సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సిరిసిల్ల పర్యటనకు బయలుదేరారు. శామీర్ పేట దగ్గర ఆగిన కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ ను కాన్వాయ్ లో ఎక్కించుకొని అక్కడ నుంచి పయనమయ్యారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకుంటారు. అక్కడ కేసీఆర్, కేటీఆర్ దంపతులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్, కేటీఆర్లు వేములవాడ నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టు బయలుదేరుతారు.
ప్రాజెక్టు దగ్గర జలహారతి చేపట్టనున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు తొలి ఏడాదే నిండి పరవళ్లు తొక్కడం పై సీఎం ఆనందంగా ఉందన్నారు. అయితే దాదాపు గంట సేపు ఇవాళ మిడ్ మానేరు ప్రాజెక్టు వద్ద గడపనున్నారు కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ కు చేరుకుంటారు. అక్కడ తీగలగుట్టపల్లి లోని తెలంగాణ భవన్ లో భోజనం చేస్తారు. భోజన విరామం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు పయనమవుతారు.