English | Telugu
మరోసారి గీత దాటిన రఘురామరాజు... మరి జగన్ రియాక్షన్ ఎలాగుంటుందో?
Updated : Nov 22, 2019
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.... సీఎం జగన్ కు కొరకురాని కొయ్యగా తయారైనట్లు వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తూ ఆగ్రహానికి గురవుతున్నారని అంటున్నారు. పార్టీ అనుమతి...ఎంపీ విజయసాయిరెడ్డి లేకుండా ప్రధాని మోడీని గానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని గానీ, అలాగే కేంద్ర మంత్రులను కానీ కలవొద్దని జగన్ ఆదేశించినా, రఘురామకృష్ణంరాజు మాత్రం లెక్కచేయడం లేదు. తనకు నచ్చిందే తాను చేస్తూ జగన్ ఆర్డర్స్ పై డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో రచ్చరచ్చ జరుగుతుంటే, అందుకు భిన్నంగా మాతృభాష పరిరక్షణపై లోక్ సభలో మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైన రఘురామకృష్ణంరాజు... మరోసారి జగన్ వద్దన్న పనే చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ ఎదురుపడటంతో రఘురామకృష్ణంరాజు వినయపూర్వకంగా నమస్తే సార్ అంటూ పలకరించారు. దాంతో, కమెండోల మధ్య నుంచే రఘురామరాజును మోడీ దగ్గరకు పిలిచారు. అలా మోడీ దగ్గరకు వెళ్లిన రఘురామకృష్ణంరాజు శిరసు వంచి నమస్కరించారు. దాంతో, రాజు గారూ అంటూ సంబోధించిన మోడీ... రఘురామరాజుతో కరచాలనం చేశారు. నవ్వుతూ ఆప్యాయంగా భుజం తట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలు ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. రఘురామకృష్ణంరాజును ప్రధాని మోడీ పేరు పెట్టి పిలిచిమరీ దగ్గరకు రప్పించుకుని ప్రత్యేకంగా పలకరించడంపై ఆశ్చర్యపోయారు.
అయితే, పార్టీ అనుమతి లేకుండా ప్రధానిని, కేంద్ర పెద్దలను కలవొద్దని జగన్ హెచ్చరించినా, మోడీని పలకరించడంపై వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, పెద్దలు ఎవరైనా ఎదురుపడినప్పుడు పలకరించడం సంప్రదాయమని, రఘురామకృష్ణంరాజు కూడా అదే చేశారని, కానీ ప్రధాని మోడీయే స్వయంగా దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారని, ఇందులో రఘురామరాజు తప్పేమీ లేదంటున్నారు. అయితే, ఎంపీగా గెలిచాక జరిగిన తొలి సమావేశాల్లోనే మోడీని రఘురామరాజు కలవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేయగా, పాత పరిచయంతోనే మర్యాదపూర్వకంగా కలిశానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు ఇంగ్లీష్ వివాదంపైనా, అలాగే మోడీని కలవడంపైనా అధిష్టానానికి ఎలా సర్దిచెప్పుకుంటారో చూడాలి.