English | Telugu
వర్షిత కేసులో సంచలన తీర్పు... మానవ మృగం రఫీకి ఉరిశిక్ష...
Updated : Feb 25, 2020
ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషికి ఉరిశిక్ష విధించింది. వర్షిత కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.... 17 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను రుజువు చేయడంలో పోలీసులు విజయవంతం కావడంతో దోషి మహ్మద్ రఫీకి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
2019, నవంబరు ఏడున చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుంటపాలేనికి చెందిన ఆరేళ్ల వర్షిత... తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చింది. అయితే, పెళ్లి వేడుకలో పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ కన్ను ఆ చిన్నారిపై పడింది. మాయ మాటలు చెప్పి వర్షితను ఎత్తుకెళ్లిన మహ్మద్ రఫీ... దూరంగా తీసుకెళ్లి అత్యాచారంచేసి చంపేశాడు. అయితే, వర్షిత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతమంతా వెదికారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. తెల్లారిన తరువాత మ్యారేజ్ ఫంక్షన్ వెనుక నిర్జీవంగా మారిన వర్షిత కనిపించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మానవ మృగం మహ్మద్ రఫీని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 17 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు చేసేందుకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రఫీ పదిహేనేళ్ల వయస్సులోనే పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో, జువైనల్ హోంలో శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. అయితే, ఏడాది క్రితం 12ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్థులు దేహశుద్ది చేశారు.
ఈ కేసులో 45మంది సాక్షులను విచారించిన చిత్తూరు కోర్టు...తగిన సాక్ష్యాధారాలు రుజువు కావడంతో రఫీకి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఉరిశిక్ష తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని జడ్జి తెలిపారు. అయితే, మానవ మృగం రఫీకి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పు వెలువరించడంతో చిన్నారి వర్షిత ఇంటి దగ్గర బంధువులు, గ్రామస్తులతోపాటు చిన్నారి చదివిన పాఠశాల విద్యార్ధులు సంబరాలు జరుపుకున్నారు.