English | Telugu
చెన్నై చేరుకున్న చైనా ప్రెసిడెంట్...
Updated : Oct 11, 2019
చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు, చెన్నై విమానాశ్రయంలో జింగ్ పింగ్ కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళని స్వామి జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. జిన్ పింగ్ రాక సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర పారంపర్య కళలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జిన్ పింగ్ విశ్రాంతి తీసుకోనున్న గిండి లోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ వరకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జిన్ పింగ్ సాయంత్రం నాలుగు గంటలకు మహాబలిపురం బయలుదేరుతారు.
చెన్నై విమానాశ్రయంలో పరింది మలై డిప్యూటీ కమిషనర్ ప్రభాకర్ నేతృత్వంలో ముగ్గురు సహాయ కమిషనర్ లు, ఏడుగురు ఇన్ స్పెక్టర్ లు, ఇరవై ఒక్క మంది ఎస్.ఐ లు, నూట ఇరవై మంది కానిస్టేబుళ్లు, భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. విమానాశ్రయం నుంచి జిన్ పింగ్ బయటకు వచ్చే దారిలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్ లు, ఆరుగురు సహాయ కమిషనర్ లు, పదహారు మంది ఇన్ స్పెక్టర్ లు, నలభై ఎనిమిది మంది ఎస్సైలు, మూడు వందల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు.
గిండీ లో జిన్ పింగ్ బస చేయనున్న ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ కు సేలం డీఐజీ నేతృత్వంలో ఏడంచెల భద్రత కల్పించారు. గిండీ నుంచి మహాబలిపురం వరకు ముప్పై నాలుగు ప్రాంతాల్లో రాష్ట్రంతో పాటు దేశంలోనూ ప్రాచుర్యం పొందిన ముప్పై నాలుగు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్ధులు, మహిళా స్వయం సహాయ బృందాలు స్వాగతం పలకనున్నాయి. సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు మహాబలిపురంలో అర్జున తప్పసు వద్దకు చేరుకోగానే ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు.
అక్కడి నుంచి ఇరువురు నేతలు కోవలంలోని తాజ్ ఫిషర్ మెన్ హోటల్ కు చేరుకుంటారు. శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత జిన్ పింగ్ తో కలిసి శనివారం మహాబలిపురం లోని సీషోర్ టెంపుల్, అర్జున తపస్సు, ఐదు రథాలు, వెన్నముద్ద రాయి మొదలైన చారిత్రిక చిహ్నాలను మోదీ సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీషోర్ టెంపుల్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాల కోసం రెండు ఆడిటోరియంలు పచ్చిక మైదానాలను సిద్ధం చేశారు.