English | Telugu
దమ్ముంటే నిరూపించు... జగన్ కు బాబు సవాల్
Updated : Dec 24, 2019
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సవాలు విసిరారు. కేవలం ఆరోపణలు చేసి రాజధానిని తరలించడం సరికాదన్న చంద్రబాబు... నిజంగా ఇన్ సైడర్ జరిగిందని వైసీపీ భావిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు నిస్వార్ధంగా భూములిస్తే... ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని భావించానని... కానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉంటే అమరావతి అభివృద్ధి జరగదన్న చంద్రబాబు... జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందామని... కానీ తనపై కోపంతో అమరావతిని తరలించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సూచించారు.
మరోవైపు, అమరావతిని తరలించొద్దంటూ రాజధాని రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. రాష్ట్రాభివృద్ధి, రాజధాని కోసం తమ భూములను త్యాగం చేస్తే తమను నట్టేట ముంచారని జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 29 రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు చేపడుతుతోన్న రైతులు, ప్రజలు... మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.