English | Telugu

కరీంనగర్ లో ఉద్రిక్తత, గుండె పోటుతో ఆర్.టి.సి కార్మికుడు మృతి...

కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది, గుండె పోటుతో మృతి చెందిన ఆర్.టి.సి కార్మికుడు నంగునూరి బాబు మృతదేహంతో అరబపల్లిలో కార్మికులు చేపట్టిన సమ్మెతో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తేనే డ్రైవరు బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని లేకుంటే ఇక్కడ నుంచి శవాన్ని కదిలించేది లేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. సమ్మెకు పరిష్కారం డ్రైవరు బాబుదే చివరి మరణం కావాలంటూ అంత్యక్రియలు చేపట్టకుండా నిలిపేశారు.


ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీలతో పాటుగా ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనకు నిరసనగా కరీంనగర్ టౌన్ బందుకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఆర్టీసి కార్మికులంతా కరీంనగర్ చేరుకోవాలంటూ జెఎసి నేత అశ్వత్థామరెడ్డి పిలిపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుడు గుండెపొటు మరణం తరువాత కరీంనగర్ లో ఉద్రిక్తత నెలకొంది, దీనికి తోడుగా ఆర్టీసీ కార్మికులు రాజకీయ నేతల చలో కరీంనగర్ పిలుపు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని అదే విధంగా చనిపోయిన ఆర్టీసీ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలి అని, వాళ్ల కుటుంబాలకు యాభై లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వాళ్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు

.
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇది ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసన తెలిపారు అయితే తాజా సమ్మె దాన్ని అధిగమించింది. మరోవైపు కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వం మొండిపట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.