English | Telugu
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Updated : Mar 14, 2020
పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.
దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు పంపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,545 కోట్లు. 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే 16 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం. మిగతా 32 వేల కోట్లనూ భరించనున్న కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ, పునరావాస వ్యయ భరింపు ఎట్టకేలకు స్పష్టత. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఉన్న 2200 కోట్లు. ఆడిటింగ్ పూర్తవ్వగానే కేంద్రం నంచి విడుదల కానున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.