English | Telugu
టీడీపీ హయాంలో పెట్టుబడులు వచ్చిన మాట నిజమే: బుగ్గన
Updated : Feb 6, 2020
కియా మోటార్స్ తరలింపు వార్తలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. రాయిటర్స్ సంస్థ పబ్లిష్ చేసిన కథనం వాస్తవం కాదని.. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కియా పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటును విస్తరణకు ప్రణాళికలు చేస్తుంటే, ఇక తరలిపోయే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. అదేవిధంగా, విశాఖలోని మిలేనియం టవర్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఓ ఐటీ సంస్థను ప్రభుత్వం అదేశించినట్టుగా జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు.
మా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం అన్నారు. 2019 అక్టోబర్ వరకు పెట్టుబడులు వచ్చాయి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెబుతోందని తెలిపారు. గతంలోను వచ్చాయి.. మొత్తం మేము క్రెడిట్ తీసుకోవాలని కూడా భావించటం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగ్ లో పెట్టారు. 3 వేల కోట్ల బకాయిలు పెట్టేసి వెళ్లారని ఆరోపించారు. తమ హయాంలో, 1051 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. జూన్ 2019 నుంచి 15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరో 8 వేల కోట్ల మేర కంపెనీలు ఉత్పత్తి కి సిద్ధంగా ఉన్నాయి. అయినా మేము ప్రచారం చేసుకోడానికి విరుద్ధమని బుగ్గన చెప్పుకొచ్చారు.