English | Telugu
ఏపీ గవర్నర్ కు మహా చిక్కొచ్చి పడింది
Updated : Jul 20, 2020
ఇప్పటికే రాష్ట్ర బీజేపీ వర్గాలు, గవర్నర్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ పంపిన ఆర్డినెన్స్‌ను, ఆమోదించవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖను, గవర్నర్ ఖాతరు చేయకపోవడమే దానికి ప్రధాన కారణం. ఆ సందర్భంలోనే రాష్ట్ర బీజేపీ నాయత్వం, గవర్నర్‌ను మార్చాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. పైగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడుల గురించి ఫిర్యాదు చేసినా, స్పందించలేదన్న అసంతృప్తి బీజేపీ వర్గాల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, తమ మనోభావాల ప్రకారం గవర్నర్ వ్యవహరించడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల విషయంలో కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర బీజేపీ నాయత్వం గవర్నర్‌ను మార్చాలని కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది. దీంతో ఈ బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఆమోదించి జగన్ సర్కార్ కి సానుకూలంగా ఉన్నానన్న సంకేతాన్ని పంపి బీజేపీ ఆగ్రహానికి గురవుతారా?.. లేక నాకెందుకీ తలనొప్పని రాష్ట్రపతికి నివేదిస్తారా? లేక న్యాయసలహా కోరతారా? అన్నది ఉత్కంఠగా మారింది. నిపుణులు మాత్రం.. రాష్ట్రపతికి పంపించడమే మంచిదని చెబుతున్నారు. చూడాలి మరి గవర్నర్ ఏం చేస్తారో?