కరోనాతో సతమతమవుతున్న దేశ ప్రజలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్, సీరం ఇండియా, భారత్ బయోటెక్ ఇప్పటికే డిసిజిఐ కి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దీనిపై రెండు వారాల్లోగా అనుకూల నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల ద్వారా తెల్సుస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల అభ్యర్థనలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ రేపు బుధవారం వ్యాక్సిన్ పనితీరు, పంపిణి పైన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఈ కమిటీ తన రిపోర్ట్ అందించిన తరువాత డిసిజిఐ రెండు వారాల్లోగా అత్యవసర అనుమతి మంజూరు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈనెల 4 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్ సిద్ధమవుతుందని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
అయితే అత్యవసర అనుమతి ఇచ్చే ముందు వ్యాక్సిన్ ప్రభావం, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అన్నిటికంటే ముఖ్యం కనుక దీనిపై పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మూడు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల పర్యటన, ఆ వెంటనే ఉత్పత్తి సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేయడం గమనిస్తే.. బహుశా త్వరలోనే వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.