English | Telugu
పెళ్లిలో ఉండాల్సిన వరుడు కటకటాల పాలయ్యాడు...
Updated : Dec 9, 2019
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. కక్కు సంగతేమో కానీ పీటల దాకా వచ్చిన పెళ్లి మాత్రం ఓ ప్రబుద్ధుడు నిర్వాకంతో ఆగిపోయింది. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అతని పేరు మోహన కృష్ణ పేరుకు తగ్గట్టు గానే ఒక పెళ్లి ఒక రాధ చాలదనుకున్నాడేమో ఓ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే నిత్య పెళ్లికొడుకు బండారం కాస్త బయటపడింది. మరో పెళ్లి జరుగుతుండగా నిశ్చితార్థం జరిగిన అమ్మాయి తరపున బంధువులు అడ్డుకోవడంతో పెళ్ళి ఆగిపోయింది. కర్నూలుకు చెందిన మోహన కృష్ణ తిరుపతిలో ఎస్బీఐ అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ గా పని చేస్తున్నాడు. అక్కడి ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. 16 లక్షల క్యాష్ 8 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. అయితే కట్నం తీసుకున్నాక ఆమె అవసరం లేదనుకున్నాడో ఏమో తిరిగి నంద్యాలలో మరో అమ్మాయి లక్ష్మీ ప్రియతో వివాహం ఖాయం చేసుకున్నాడు. ఇక్కడ కూడా కట్నకానుకలు పుచ్చుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే మోహన కృష్ణ నంద్యాలలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు వాళ్ళకు తెలిసింది. తిరుపతి నుంచి అమ్మాయి బంధువులు వచ్చి వరుడి వ్యవహారం పందిట్లో పదిమందికీ చెప్పారు. దీంతో అక్షింతలు వేయాల్సి చేతులతో తలో ఒక దెబ్బ వేసి చితక్కొట్టారు. తమ ఆడపిల్లను మోసం చేసి కట్నం కాజేశాడని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు అమ్మాయిల తరపు బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి కాస్తా పెటాకులైంది.