English | Telugu
టెంపర్ గొడవ.. బండ్లను హత్య చేసేందుకు పీవీపీ రెక్కీ!!
Updated : Oct 5, 2019
అప్పట్లో బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా రేంజ్ ఏంటో మీకు తెలీదు, నేను తలచుకుంటే ట్రంప్ తో కూడా ఫోటో దిగగలనని డైలాగ్స్ కొట్టారు. మరి బండ్ల రేంజ్ ఏంటో తెలీదు కానీ.. తాజాగా ఆయన తనవెంట ఓ నలుగురు మనుషుల్ని తీసుకెళ్లి.. ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వెళ్లి.. అంతు చూస్తామని బెదిరించారట. ఈ మేరకు పీవీపీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు పీవీపీ, బండ్ల మధ్య గొడవకి కారణం టెంపర్ సినిమా. టెంపర్ సినిమా సమయంలో పీవీపీ వద్ద.. సినిమా ఫైనాన్స్ పేరుతో రూ.7 కోట్లు తీసుకుని బండ్ల టెంపర్‌లో పెట్టుబడి పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి.. కొంత మొత్తం చెల్లించారు. ఇంకా కొంత మొత్తం బ్యాలెన్స్, వడ్డీ కట్టాల్సి ఉంది. అయితే.. సినిమా రిలీజ్ తర్వాత బ్యాంకులో వేసుకునేలా పీవీపీకి చెక్కులు ఇచ్చి బండ్ల అప్పటికి సర్దుబాటు చేసుకున్నారు. కానీ చెక్కులు బౌన్స్ అయ్యాయి. రోజులు గడుస్తున్నా.. పీవీపీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదట. వాటిని చెల్లించాలని ఒత్తిడి తెస్తూండటంతో అంతిమంగా బెదిరింపు బాటను బండ్ల ఎంచుకున్నారని పీవీపీ ఆరోపిస్తున్నారు. గత రాత్రి అనుచరులతో కలిసి పీవీపీ ఇంటికి వెళ్లిన బండ్ల.. పీవీపీని, ఆయన కుటుంబీకులను బెదిరించారట. దీంతో, జూబ్లీహిల్స్ పీఎస్ లో పీవీపీ స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో బండ్ల సహా మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
అయితే ఈ వ్యవహారంపై బండ్ల గణేష్ స్పందన మాత్రం మరోలా ఉంది. పీవీపీనే తనని బెదిరించారని, పీవీపీతో తనకి ప్రాణహాని ఉందని అంటున్నారు. తాను డబ్బులు బకాయి ఉన్నానంటూ కోర్టుకెళ్లి, కేసులు వేసిన పీవీపీ, ఇప్పుడు తనపై దౌర్జన్యానికి దిగుతూ, హత్య చేస్తానని బెదిరిస్తున్నారని బండ్ల ఆరోపించారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. విజయవాడ తన చేతుల్లోనే ఉందని, ఏపీలో తాను ఏం చెబితే అది జరుగుతుందని పీవీపీ తనను బెదిరించినట్టు బండ్ల ఆరోపించారు. తనను హత్య చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు వేధింపులు పెరిగాయని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పీవీపీని పిలిపించి మాట్లాడతామని తనకు హామీ ఇచ్చారని మీడియాకు బండ్ల గణేష్ వివరించారు. మరి ఇద్దరిలో ఎవరు ఎవర్ని బెదిరించారో పీవీపీ, బండ్లకే తెలియాలి.