English | Telugu
కేసిఆర్ వంగి వంగి దండాలు పెట్టినా జైలుకు పోక తప్పదు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
Updated : Dec 14, 2020
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోతలరాయుడైన కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తాము ముందే చెప్పామని అయన అన్నారు. ఢిల్లీలో వంగివంగి పొర్లి దండాలు పెట్టినా తాము కేసిఆర్ ను క్షమించే ప్రసక్తే లేదని అయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నగర ప్రజలు చావు దెబ్బ కొట్టారని సంజయ్ అన్నారు. ఈ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. లోపల జరిగేది ఒకటని.. అయితే కేసీఆర్ బయటకు చెప్పేది మరొకటని అన్నారు. హైదరాబాదును వరదలు ముంచెత్తుతుంటే ఫాంహౌస్ వదిలిపెట్టి కేసీఆర్ బయటకు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారని గుర్తు చేసిన బండి సంజయ్… కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని, ఇదేంటని ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటున్నారని.. రాష్ట్రమేమైనా మీ అయ్య జాగీరా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.