English | Telugu

అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్ విడుదల.. ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆయనకైన గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని చెప్పారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, అలాగే ఆయనకు షుగర్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

మరోవైపు, అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడి కోరుకున్న చోట ఆయనకు వైద్య సహాయం అందించాలని ఏసీబీ అధికారులకు జగన్ ఆదేశించినట్టు సమాచారం. కాగా, కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి అచ్చెన్నాయుడుని తరలించారు.