English | Telugu
నొప్పి ఉన్నచోటే మందు రాయాలి... తలనొప్పి వచ్చిందని తలే తీసేస్తారా?
Updated : Jan 10, 2020
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి... కోర్టు బోనులో నిలబడి ఆంధ్రాకు తలవంపులు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. జయలలిత తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బోనులో నిలబడింది ఒక్క జగనే అన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సిగ్గుచేటంటూ అశోక్ నిప్పులు చెరిగారు. ఏపీలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉందన్న అశోక్ గజపతిరాజు... సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిల్చుంటే.... ఆంధ్రుల పరువు పెరుగుతుందా? పోతుందా? అంటూ ప్రశ్నించారు.
ఇక, మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ విజయనగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీతోపాటు లోక్‌సత్తా, ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించిన జగన్... ఇప్పుడు మూడు రాజధానులు అనడం సరికాదని అశోక్ గజపతిరాజు అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందన్నారు. జగన్ పరిపాలన చూస్తుంటే... మొఘలుల పాలన గుర్తొస్తుందని అన్నారు. రాజధానులను మార్చడం మంచి సంస్కృతి కాదన్న అశోక్ గజపతిరాజు.... అమరావతి నుంచి కేపిటల్‌ను తరలించే శక్తి ఎవరికీ లేదన్నారు.
అయినా, తలనొప్పి వస్తే మాత్ర వేసుకోవాలని, కానీ తలే తీసేస్తానంటే కుదురుతుందా? అంటూ అశోక్ ప్రశ్నించారు. నొప్పి ఉన్నచోటే మందు రాయాలే కానీ... మొత్తం ఆ భాగాన్నే తీసేస్తాననడం సరికాదని సీఎం జగన్ కు అశోక్ గజపతిరాజు సూచించారు.