English | Telugu

ఢిల్లీ పొలిటికల్ వార్.. కేజ్రీవాల్ ఉగ్రవాది.. దమ్ముంటే అరెస్టు చెయ్యండి

కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది.. ఆయన ఓ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. ఇక అదే మాటను ఎన్నికల ప్రచారంలో తెగ వాడేస్తున్నారు కేజ్రీవాల్. నేను ఉగ్రవాదినా..? మీరే చెప్పండి అంటూ అమాయకంగా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారు. అందుకు సమాధానంగా కేజ్రీవాల్ ఉగ్రవాదేనంటూ జవదేకర్ అన్నారు. ఒకానొక సమయంలో స్వయంగా తనకు తాను అరాచకవాదినని కేజ్రీవాల్ చెప్పుకున్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. అరాచకాలకు పాల్పడే వారిని ఉగ్రవాదితో పోలిస్తే తప్పేంటి అని.. రెండింటికి పెద్ద తేడా లేదని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడ్డారు. అంతే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని సంభోదిస్తున్నపుడు భాష ముఖ్యమని గుర్తు చేశారు. ఇక మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన తరువాత ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆప్ పార్టీ పేరును ముస్లిం లీగ్ అని మార్చుకోమంటూ హితవు పలికారు బీజేపీ నేత కపిల్ మిశ్రా.