English | Telugu

భారత సరిహద్దులలో తెలంగాణ జవాను మృతి.. మృతిపై స్పష్టత ఇవ్వని అధికారులు.. 

మనదేశ సరిహద్దులలోని లేహ్ లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ జవాను మృతి చెందాడు. అయితే ఆ జవాను మరణానికి గల కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం 2004లో ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. అనేక రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహించిన 35 ఏళ్ల పరశురాం ప్రస్తుతం సరిహద్దులోని లేహ్ ప్రాంతంలో నాయక్ ర్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సైనికాధికారులు పరశురాం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన మరణవార్త తెలియ చేసారు. అయితే, పరశురాం ఎలా చనిపోయాడన్న విషయం మాత్రం వారు చెప్పలేదు. అయితే జవాను పరశురామ్ మృతి చెందిన నేపథ్యంలో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త విన్న పలువురు రాజకీయ నాయకులు పరశురాం కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సంతాపం తెలియచేసారు. అధికారులు పరశురాం మృతదేహాన్ని గువ్వనికుంట తండా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.