English | Telugu

ఆర్టీసీ విలీనం... తెలంగాణలో 'నో', ఆంధ్రాలో 'ఎస్'

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెండూ.. రెండు భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక పక్క ఆర్టీసీ సమ్మెలతో తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తియ్యటి కబురుని అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గత కొద్ది రోజులుగా ఈ విషయంపై పాలక వర్గంలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 52వేల మంది సిబ్బందిని ప్రజా రావాణా శాఖలోకి విలీనం చేసేందుకు ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నట్లు పాలక మండలి తెలియజేసింది.సంస్థలోని పాత బస్సుల స్థానంలో.. తొలి విడతగా 350 విద్యుత్‌ బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది పాలక మండలి. పాలక మండలి నిర్ణయాలను అధికారికంగా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జనవరి నుండి ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్హత పొందనున్నారు. 2015 లో తీసుకన్న నిర్ణయం ప్రకారం ఆర్టీసీలో మెడికల్‌ గా అన్‌ ఫిట్‌ అయిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న సర్క్యులర్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్‌ను శాశ్వతంగా రద్దు చేసింది.