English | Telugu

ఇప్పటిదాకా తీసుకున్న జీతం కట్టి పోండి.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్!!

మీరు గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగా?.. మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు కేవలం రాజీనామా లేఖ ఒక్కటే ఇస్తే సరిపోదు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన తరువాత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లించాలి. అప్పుడే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగాన్ని వదులుకొని, సచివాలయ ఉద్యోగిగా మిగిలిపోక తప్పదు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన మహేశ్వర్ రెడ్డికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఆ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ.2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం కలిపి మొత్తం రూ.57,095 తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన తరువాత మాత్రమే రాజీనామా ఆమోదం తెలుపుతామని అధికారులు చెప్పినట్టు సమాచారం.

ఇక, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాల్లో ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్లు.. మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఎంపీడీవోలకు లేఖ రాస్తూ.. ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేసిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.