English | Telugu

మూడు రాజధానులపై హైకోర్టుకెక్కిన సెక్రటేరియట్ ఉద్యోగులు

ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులు ఒక పక్క గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా మరో పక్క ఏపీ సచివాలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఏ ఉద్యోగ సంఘం కూడా వ్యతిరేకించడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఆ పిటిషన్ లో రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు

రాజధాని తరలింపు కేసులో ఒక పిటిషనర్ అయిన రాజధాని పరిరక్షణ సమితి తమ పిటిషన్ లో ఉద్యోగులపై హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని అయన అన్నారు. రాజధాని తరలింపు కోసం ఉద్యోగులకు ఇంటి రుణ సౌకర్యం, మెడికల్ సబ్సీడి వంటి సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తుందని తాను ఉద్యోగుల మీటింగ్‌లో చెప్పినట్లుగా పిటిషనర్ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అంతే కాకుండా రాజధాని అనేది కేవలం భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని అది మొత్తం రాష్ట్ర ప్రజలందరి హక్కు అని అయన స్పష్టం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగితే అమరావతి పరిరక్షణ సమితి స్పందించలేదని, కానీ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మాత్రం అడ్డు పడుతుందని అయన విమర్శించారు. అంతే కాకుండా ఇప్పటికే అమరావతిలో రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని తమ పిటిషన్‌లో అయన పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇటువంటి ఆరోపణలతో తమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొంత మంది రాజకీయ స్వప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ పిటిషన్ వేశారని దీనిలో ఏ విధమైన ప్రజా ప్రయోజనాలు లేవని అయన స్పష్టం చేశారు. రాజధాని తరలింపునకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని అయితే రాజధాని తరలింపునకు కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నిరాధార పిటిషన్లు వేయకుండా నివారించడానికి పిటిషనర్‌కు భారీ జరిమాన విధించాలని కోర్టుకు అయన విజ్ఞప్తి చేశారు.