English | Telugu
తరతమ భేదం లేకుండా అందరిని చుట్టేస్తున్న కరోనా
Updated : Jun 15, 2020
భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మన దేశం కరోనా కేసుల విషయం లో నాలుగో స్థానానికి చేరుకొంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా రోజు కు రెండు వందలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి వద్ద 12 ఏళ్లుగా గన్ మాన్ గా ఉన్న సురేష్ మొన్న శుక్రవారం మృతి చెందారు. ఐతే ఆయనకు కరోనా పరీక్ష చేయగా చనిపోయిన తరువాత పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే తో పాటు .. సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీసు సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. ఐతే ఎమ్మెల్యేకు మాత్రం రెండు సార్లు చేసిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సూర్యరావుపేట లో నిన్న కొత్తగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పటికే 14 కేసులు ఉండగా మొత్తం కేసులు 40 కి చేరాయి. మరో పక్క గుంటూరు డీఎంహెచ్ ఓ ఆఫీసులో పని చేసే అధికారికి పాజిటివ్ గా నిర్దారణ ఐంది. దీంతో ఆ ఆఫీసులో పని చేసే వారికి పరీక్షలు చేసారు. ఇదే అధికారి గుంటూరు కలెక్టర్ ఆఫీసుకు కూడా వెళ్ళివచ్చినట్లుగా తేలడంతో ఈ రోజు కలెక్టరేట్ లోని ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలు చేస్తారని తెలుస్తోంది.