English | Telugu

పాపం.. అడ్డంగా బుక్కయిన మంత్రిగారు.. 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కరప మండలం, గొర్రిపూడిలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయంలో జరిగిన వేడుకలు తాజాగా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ వేడుకలలో భక్తి కార్యక్రమాలు కాకుండా రికార్డింగ్ డాన్సులు జరగడం.. ఇదే సమయంలో ఈ వేడుకలకు ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు హాజరవ్వడం ఇపుడు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సాక్షాత్తు మంత్రి గారి సాక్షిగా భక్తి కార్యక్రమాలు జరగవలసిన చోట ఈ రికార్డింగ్ డాన్సులేంటి అంటూ భక్తులు మండి పడుతున్నారు. అయినా మంత్రి గారైనా దీనిని ఆపకుండా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడంతో ఈ మొత్తం వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

మరోపక్క "ఆలయాలలో దేవుని దర్శనాలకు, పండగలకు, పంచాయితీ ఎన్నికలు జరపడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయి కానీ ఇలాంటి రికార్డ్ డాన్సులకు మాత్రం కోవిడ్ నిబంధనలు అడ్డురావా…? అసలు ఇలాంటివి నియంత్రించాల్సిన పోలీసులే గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉండడం పోలీసు వ్యవస్థ ఈ జగన్ పాలనలో నిర్వీర్యమైపోయింది అనడానికి నిదర్శనం." అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై మరి మంత్రి కన్నబాబు గారు ఏవిధముగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య స్మ్రుతి వనం వద్ద రికార్డింగ్ డాన్సులతో చెడ్డపేరు తెచ్చుకున్న వైసీపీ శ్రేణులు తాజాగా మంత్రిగారి సమక్షంలో ఆలయం వద్ద జరిగిన వేడుకలలో రికార్డింగ్ డాన్సుల పర్వం రిపీట్ అవడంతో వైసీపీ పరువు గంగపాలవుతోందని కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.