English | Telugu

ఏకంగా సభలోనే తొడ గొట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ నేతల పై మాటల తూటాలతో దాడి చేసే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా శాసన మండలిలో టీడీపీ నేతల పై మరోసారి విరుచుకు పడ్డారు. ఈ రోజు మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు ల మధ్య శాసనమండలిలో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన మంత్రి అనిల్ ఏకంగా సభలోనే తొడగొట్టారు. ఈ రోజు చర్చలో భాగంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. అదే సమయం లో ఆయన వ్యాఖ్యలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

ఈ చర్చలో జోక్యం కల్పించుకున్న మంత్రి అనిల్ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో టీడీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని అయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సభలోనే తొడగొట్టారు. నెల్లూరు లో తనను ఓడించడానికి ఎన్నికల్లో టీడీపీ నాయకులు కోట్లు ఖర్చు చేసారని.. అయినా తాను గెలిచి శాసన సభకు వచ్చానని అనిల్ అన్నారు. ఐతే అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మండలి చైర్మన్ షరీఫ్ సభను కొద్దీ సేపు వాయిదా వేశారు.