English | Telugu
ఫిల్మ్ నగర్ కి తాకిన అమరావతి ఉద్యమ సెగ.. సినీ పరిశ్రమ మద్దతు కోసం ఆందోళన
Updated : Feb 8, 2020
రాజధాని రైతుల ఆందోళనలకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ఆందోళన జరిగింది. రాజధాని అమరావతికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపికి చెందిన ఏపి జెఏసి అదేవిధంగా మరి కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా ప్రముఖుల ఫోటోలు పట్టుకొని, అమరావతికి మద్దతివ్వాలని కోరుతూ.. పెద్ద ఎత్తున జై అమరావతి నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ మద్దతుగా నిలిచింది.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా 50 రోజులకు పైగా పెద్దఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు. ప్రజల తరపున నిలబడే బాధ్యత కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందము పై బాధ్యత ఎంతో ఉందని.. ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను తీసుకొని ముందడుగు వేయాలని అమరావతి జేఏసీ కోరుతోంది. ప్రజలు అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా రాజధానిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ముందుకు రావాలని వారు కోరుతున్నారు.