English | Telugu

ఎన్నికల కమిషన్ వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే 

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఈరోజు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషన్ అంశంలో సీఐడీ చేస్తున్న దర్యాప్తు పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు నమోదు చేసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పిటిషన్ లో అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిమ్మగడ్డ రమేశ్, సాంబమూర్తిల పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు ఈరోజు తెలిపింది. ముందుగా ఈ కేసులో విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారో వివరాలు తెలపాలని ఏపీ సిఐడిని ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.