English | Telugu

ఏపీ సీఐడీ తీరుపై హైకోర్టు అసహనం.. ప్రభుత్వానికి ఒక న్యాయం, కోర్టులకి ఒక న్యాయమా?

న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వివిధ సోషల్‌ మీడియా కంపెనీలకు హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ లను కంపెనీలకు అందించాలని సీఐడీకి సూచించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై కొందరు సోషల్‌ మీడియాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అయితే, సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో పురోగతి లేదని, సోషల్‌ మీడియా కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు ఆర్‌జీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన అఫిడవిట్ ​లో సవరణ చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ కౌంటరు దాఖలు చేయడానికి స్వల్ప గడువు కోరారు. అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటరు వేసేందుకు ధర్మాసనం గడువిచ్చింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్​ లో న్యాయవాది మురళీధర్‌రావు వాదనలు వినిపించారు. హైకోర్టుపై సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టింగుల వెనుక కుట్రకోణం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివరాలను దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచించింది. న్యాయవాది బదులిస్తూ.. దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. హైకోర్టు 94 మందిపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తే కొంతమందిపైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవ్యవస్థపై పోస్టింగుల వెనుక ఉండి మొత్తం చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్‌ కిషోర్‌ కు చెందిన ఐ ప్యాక్‌ టీమ్‌కు కోట్ల రూపాయలు చెల్లించి వైసీపీ నియమించుకుందని, ఈ టీమ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా తమ వ్యతిరేకులపై ప్రజల్లో ద్వేషం కలిగించడంలో సిద్ధ హస్తులని పిటిషనర్‌ శివానందరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా స్లీపర్‌ షెల్‌ల తరహాలో వ్యవహరిస్తున్నారని, హైకోర్టు జడ్డీలను అపకీర్తి పాలుచేయడం వైసీపీ వ్యూహంలో భాగమేనన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక స్పష్టమైన కుట్ర దాగుందన్న శివానంద రెడ్డి... దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చేధించాలని కోరారు.

సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఓ తీర్పు ప్రకారం అభ్యంతర పోస్టింగులను తొలగించాల్సి ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీరెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పేపర్లపై పని చేసినట్లు కనిపించడం కాదని.. చర్యలు వాస్తవ రూపంలో ఉండాలని వ్యాఖ్యానించింది. నిజంగా న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే ఆ పోస్టింగుల తొలగింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మరోవైపు, ఏపీ సీఐడీ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి ఒక న్యాయం, కోర్టులకి ఒక న్యాయమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై.. ముసలీ ముతకా అని కూడా చూడకుండా సీఐడీ కేసులు నమోదు చేసింది. అంతేకాదు విచారణ పేరుతో తమ కార్యాలయాల చుట్టూ తిప్పించింది. అయితే, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై మాత్రం సీఐడీ అదే దూకుడు చూపలేకపోతోంది. వారంతా అధికార పార్టీ సానుభూతిపరులు కావడంతోనే సీఐడీ దూకుడుగా వ్యవహరించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.