English | Telugu
హైకోర్టులో జగన్ సర్కార్ కి కాస్త ఊరట
Updated : May 29, 2020
జగన్ సర్కార్ విక్రయించదలచిన భూముల్లో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 28 నుంచే భూముల వేలం ప్రక్రియ జరగనుందని, చట్టనిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకోవాలని కోరారు. 2012 లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు ఈ భూముల్ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కోర్టుకు వివరించారు. గుంటూరులో విక్రయించతలపెట్టిన స్థలంలో మార్కెట్ కొనసాగుతోందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఉన్న దీనిని విక్రయించరాదని వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భూముల వేలం వాయిదా పడిందని, జూన్ 11 నుంచి 13 వరకు వేలం నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వం విక్రయించతలచిన భూములన్నీ ఖాళీ స్థలాలని. వాటిని విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందంటూ విచారణను జూన్ 18 కి వాయిదా వేసింది.