English | Telugu

ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ సర్కార్ పై మండిపడ్డ హైకోర్టు 

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా హైకోర్టు తన తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వినతుల పై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. తాము తొలగించిన వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంతో.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే సహాయ నిరాకరణ పద్దతిలో వ్యవహరిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు మారుతాయి, కానీ రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ అలాగే ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, అటువంటి వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని న్యాయస్థానం పేర్కొంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం సహాయమందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం అమలు చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.