English | Telugu

సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజీ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉందాలన్నారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి అని అధికారులను ఆదేశించారు.