English | Telugu
మద్యం నియంత్రణ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్...
Updated : Nov 8, 2019
మద్యం నిషేధం పై జగన్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది అనే చెప్పుకోవాలి. మద్యం నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్లను రాత్రి పది గంటల వరకే అనమతించాలని ఆదేశాలిచ్చింది. దశల వారిగా మద్య నిషేధం విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో బార్ ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్ నిర్ణయించారు. జనవరి ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బారులు ఉండాలనీ, అనుమతిచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్ లలో మద్యం విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఆ మేరకు విధి విధానాల ఖరారు చేయాలని ఆదేశించారు. దశల వారీగా మద్య నిషేధంపై వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి తమ సర్కారు కట్టుబడి ఉందని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
మద్య నిషేధం దిశగా ఏపీ సర్కారు ఇప్పటికే పలు నిర్ణయాలను తీసుకుంది. మద్యం లైసెన్సులు పునరుద్ధరించక పోగా అమ్మకాల్ని ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకొచ్చింది. మద్యం రేట్లు కూడా భారీగా పెంచింది. కొన్ని బ్రాండ్ లు మాత్రమే అమ్మాలని కూడా నిర్ణయించింది. మద్యం ధరలు విపరీతంగా పెంచటంపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న జగన్ సర్కారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.నిజంగానే మద్యం నిషేధం పై జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.