English | Telugu
మొన్న మద్యం... నిన్న ఆర్టీసీ... ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు... జనంపై జగన్ సర్కారు వాతలు...
Updated : Feb 11, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వాత మోత మొదలైంది. ఓటు బ్యాంకే లక్ష్యంగా హద్దూపద్దూ ఎన్నికల్లో హామీలిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వాటిని అమలు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు కోసం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే సుమారు 60వేల కోట్ల అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... ప్రజలపై పరోక్షంగా భారం మోపుతూనే ఉంది. దశల వారీ మద్యం నిషేధమంటూ లిక్కర్ ధరలను భారీగా పెంచేసి మద్యం ప్రియులపై పెనుభారం మోపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీలపై మోత మోగించింది.
ఇక, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల వంతు వచ్చింది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులపై జగన్ ప్రభుత్వం భారం మోపింది. యూనిట్ కు 90 పైసలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అంటే, ఐదొందల యూనిట్లు పైబడినవారికి యూనిట్ ధర 9 రూపాయల 95 పైసలు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపైనే భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్నా.... 500 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించుకునే ప్రజలు లక్షల్లోనే ఉన్నారు. సుమారు కోటిన్నర మంది గృహ వినియోగదారుల్లో కోటీ 30లక్షల మందిపై పెనుభారం పడనుంది. అలాగే, పెంచిన ఛార్జీల కారణంగా ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై 13వందల కోట్ల రూపాయల భారం పడనుంది. మరోవైపు, ప్రభుత్వ సబ్సిడీ భారీ పెరిగిపోయిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని అధికారులు బాంబు పేల్చారు.