English | Telugu
యూనివర్సిటీ భూములను వదిలేయండి... ఏపీ ప్రభుత్వ భూముల అమ్మకం!
Updated : Nov 21, 2019
నవరత్నాలు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములను.. వాటి పరిధిలోని సంస్థల భూములను.. కూడా అమ్మాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. అందుకోసం బిఏపి ని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల భూములు కూడా అమ్మాలని ఆ ఒప్పందంలో లిఖిత పూర్వకంగా తెలిపింది. విక్రయానికి పనికొచ్చే భూముల వివరాలు వెల్లడించాలంటూ ఇటీవల రెండు ఫార్మాట్లలో సమాచారం కోరింది.
యూనివర్సిటీల భూములు అమ్మాలని నిర్ణయించడాన్ని విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి వర్గాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సరస్వతి నిలయాల్లో భూములు విక్రయించవద్దని ప్రభుత్వానికి పలు వినతులు అందుతున్నాయి. ఈ వ్యవహారం వర్సిటీలు.. కాలేజీల్లో.. కొత్త అలజడికి దారితీస్తుండడంతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. వర్సిటీలు.. విద్యాసంస్థలు.. కాలేజీల భూములను అమ్మవద్దని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. వర్సిటీ భూములను జాబితాలో చేర్చి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అన్ని విశ్వవిద్యాలయాలు.. కాలేజీలు.. పాఠశాలల భూములకు బిల్డ్ ఏపీ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇస్తున్నామని ఒకవేళ ఏవైనా జిల్లాలో వీటికి సంబంధించిన భూములను మాస్టర్ ప్లాన్ లో చేరిస్తే వెంటనే తొలగించాలని బిఏపికి కలెక్టర్ లకు సీఎంవో ఆదేశాలిచ్చింది.ఈ నేపధ్యంలో ఎన్బీసీసీ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని రెవెన్యూశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.