English | Telugu

ఆట మొదలైంది.. ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయ సభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల.. ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

బిల్లులు సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భాలు రాజ్యసభలోనూ, వివిధ అసెంబ్లీల్లోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా, కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని సచివాలయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం విషయంలోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్సులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, ఉభయ సభలు ప్రోరోగ్ కావడంతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలను అమల్లో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేయనుంది.