English | Telugu
డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ! ఏపీ కేబినెట్ ఆమోదం
Updated : Nov 27, 2020
నివర్ తుపానుపై కేబినెట్‌లో చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు , 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించామని, శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు కన్నబాబు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 25న 30లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, మూడేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.