English | Telugu
కరోనా పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారింది! కేంద్ర చర్యలపై సుప్రీం అసంతృప్తి
Updated : Nov 27, 2020
క్షేత్రస్థాయిలో మాస్క్‌లు ధరించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని ధర్మాసనం వెల్లడించింది. 80శాతం ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవట్లేదు. మిగతా వాళ్లు పెట్టుకున్నా వాటిని దవడ కిందకు వేలాడదీస్తున్నారని తెలిపింది. పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారింది.. డిసెంబరులో మరింత దిగజారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కరోనా ఆసుపత్రిలో గత శుక్రవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. కేంద్రం మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సుమోటాగా తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్‌కోట్ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా.. వివాహాది శుభకార్యాలపై ఎందుకు నిబంధనలు తీసుకురాలేదని గుజరాత్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఎందుకు వేడుకలకు అనుమతిస్తున్నారని మండిపడింది. కరోనా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ డిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం.