English | Telugu

తెలుగు రాష్ట్రాల వివాదం పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకోనుంది...

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇవాళ కూడా చర్చలు జరపనుంది. చర్చలు పూర్తి కాకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమావేశమైంది. తొలి రోజు చర్చల్లో వ్యవహారం కొలిక్కి రాలేదు. దీంతో శనివారం కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆంధ్ర స్థానికత కలిగిన పదకొండు వందల యాభై ఏడు మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తమ సంస్థల నుంచి ఏక పక్షంగా తొలగించి ఆంధ్రాకు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రస్తుతం చర్చలు జరుపుతున్న ధర్మాధికారి కమిటీ తన పని కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణ ట్రాన్స్ కో ఆకస్మికంగా పదకొండు వందల యాభై ఏడు మందిని మళ్లీ ఆంధ్రాకు కేటాయిస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయటం వేడి పెంచింది. శుక్రవారం జరిగిన ధర్మాధికారి కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్ర అధికారులు గట్టిగా నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ధర్మాధికారి కూడా తెలంగాణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పూర్తి కాకుండానే ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆయన వారిని ప్రశ్నించారు. తరువాత జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాలు సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని ఆయన సూచించారు.

వివాదంలో ఉన్న పదకొండు వందల యాభై ఏడు మంది ఉద్యోగుల్లో ఆరు వందల పదమూడు మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ధర్మాధికారి సూచించారు. ఆంధ్ర అధికారులు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన ఉద్యోగులేనని వారిని తీసుకుంటే తమపై ఆర్థిక భారం పెరగడమే కాకుండా పదోన్నతల విషయంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఐచ్ఛికాల ప్రకారం వెళ్లాలని మరో మార్గం లేదని తెలంగాణ అధికారులు వాదించారు. మరో రెండు వందల యాభై మంది ఉద్యోగుల విషయంలో కూడా వివాదం ఏర్పడింది. వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని తాము తీసుకునేది లేదని ఆంధ్రా అధికారుల తేల్చిచెప్పగ వారిని మీరే తీసుకోవాలని తెలంగాణ అధికారులు పట్టుబట్టారు. వీటికి పరిష్కారం దొరక్కపోతే తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ఇరు రాష్ట్రాల సీఎంలకు అప్పగించాలని ధర్మాధికారి కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరో పక్క చర్చల తీరు పై ఆంధ్రా విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన కేటాయింపు ఉందని దానికి మించి అదనంగా ఎవరినీ తమ రాష్ట్రానికి తీసుకున్న అంగీకరించేది లేదని ఏపీ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ రాశాయి. ఎలాంటి సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేయకుండా రెండు వేల పద్నాలుగు జూన్ ఒకటి నాటికి ఉన్న పోస్టుల ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ విద్యుత్ బోర్డు ఏఈల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు విరుద్ధంగా వెళ్తే నోటీసులు ఇవ్వకుండానే ఆందోళనకు దిగుతామని జరిగే పరిణామాలకు బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రాసింది.