English | Telugu

దగ్గుబాటి మళ్ళీ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా.. వేడెక్కిన పరుచూరు రాజకీయం

ప్రకాశం జిల్లా పరుచూరు వైసీపీ ఇన్ చార్జి నియామకం విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పరుచూరు వైసీపీ ఇన్ చార్జిగా రవి రామనాధబాబు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ఒంగోలులో నాడు నేడు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్న సభకు రామనాథం బాబు పరుచూరు వైసీపీ ఇన్ చార్జి హోదాలో పాల్గొన్నారు. సీఎం సభలో ముందు వరుసలో కూర్చున్నారు. పరుచూరు వైసీపీ ఇంచార్జ్ వ్యవహారంలో రగులుతున్న రగడకు పుల్ స్టాప్ పడినట్టే అని కేడర్ భావిస్తోంది.

అయితే పార్టీలోని అసంతృప్తి నేతలను సమన్వయం చేసుకోవాలని రామనాథంకు అధిష్టానం షరతులు పెట్టినట్టు కార్యకర్తలూ గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ సమన్వయం చేసుకోకుని పక్షాన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఇన్ చార్జిగా పని చేసి అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రావి రామనాధ బాబు అప్పట్లో టిడిపిలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా పని చేశారు. ఎన్నికల తరువాత దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలని సీఎం జగన్ తేల్చి చెప్పడంతో దగ్గుబాటి వైసీపీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎటూ తేల్చకుండా సైలెంటైపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల రామనాధ బాబు తిరిగి వైసీపీలో చేరడంతో పరుచూరు రాజకీయాలు వేడెక్కాయి. తాజా పరిణామాలతో ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయ ప్రస్థానం వైసీపీలో ముగిసిపోయినట్టే అంటున్నారు. మరోసారి దగ్గుబాటి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కొత్త ఇన్ చార్జి రామనాథం నియామకంతో పార్టీ కేడర్ లో నిర్లిప్తత నెలకొంది. తమ అభిప్రాయాలను కాదని తమ ఇష్టానుసారంగా అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని గొట్టిపాటి భరత్ వర్గీయులు కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్ చార్జి పదవి దక్కించుకున్న రామనాథం బాబుకు ఇంటి పోరు తప్పదన్న అభిప్రాయం క్యాడర్ లో నెలకొనుంది. మరి పార్టీ కేడర్ ను తన దారికి తెచ్చుకోవడంలో రామనాథం ఎక్కుపెట్టి రామబాణం ఏంటనేది ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.