English | Telugu
మద్యం ధరలను తగ్గించిన జగన్ సర్కార్
Updated : Oct 29, 2020
మద్యం ప్రియులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మీడియం, ప్రీమియం ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ కేటగిరీల బ్రాండ్లపై 25శాతం వరకు ధరలను తగ్గించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, క్వార్టర్ ధర రూ.200ల పైన ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల పరిమాణాలు, బ్రాండ్లను బట్టి తగ్గింపు రూ.50 నుంచి రూ.1350 వరకు ఉండనుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. అయితే బీర్లు, రెడీ టూ డ్రింక్స్ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్న వైసీపీ.. మద్యనిషేదం చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే మద్యం ధరలు పెంచి ప్రజలకు మద్యం అందుబాటు ధరలో లేకుండా చేస్తున్నామని ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆదాయం పడిపోవడంతో.. అమ్మకాలు పెంచుకునేందుకు ధరలను తగ్గించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.