English | Telugu

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ ‌రెడ్డిల‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జూన్ 13న అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ల బెయిల్‌ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. వీరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి.

కాగా, బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేసి తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఆ వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలతో పాటు, 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు సమర్పించినట్టు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫోర్జరీ కేసులో గత శనివారం వారిని హైదరాబాద్‌లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అనంతపురం తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. మొదట అనంతపురం జైలుకు తరలించాలని భావించినప్పటికీ, అక్కడ కరోనా మహమ్మారి భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆన్‌లైన్‌లో బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై గురువారం న్యాయమూర్తి విచారించారు. అయితే బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఇద్దరికీ నిరాశ తప్పలేదు.